దేవి ప్రియ కవిత్వంలో అరుదైన ప్రతీకలు by Bikki krishna

దేవి ప్రియ కవిత్వంలో అరుదైన ప్రతీకలు దర్శనమిస్తాయి.’అమ్మచెట్టు’ ‘తుఫాను తుమ్మెద’ ‘చేపచిలుక’ ‘గంధకుటి’ ‘గాలిరంగు’ ‘అరణ్యపురాణం’ లాంటి పదబంధాలు ఆయన కవితాసంపుటాల శీర్షికలై దేవిప్రియను ఇతరకవులకు భిన్నమైన కవిగా నిలబెట్టాయి.ఆయన కవితా నిర్మాణం అత్యంత సరళమై,objective co -rellation తో ,కొన్ని చోట్ల పేరడాక్స్,అలిగొరి,కన్సీట్ పొయేట్రీ డెవిసెస్ ఛాయలతో..సరికొత్త ఇమేజరీతో తాత్వికత ,భావుకత,అభివ్యక్తి నవ్యతల కలనేతగా నిరలంకారకవితా రూపంలో అద్భుత కవితాశిల్పమై అలరారింది.దేవిప్రియగారి నిరాడంబర జీవితం ఆతని కవిత్వతత్వమై ఒక తాత్విక భూమికగా మారింది.స్థల కాలాదులు,ప్రజా ఉద్యమాలు,మానవ విలువలు మృగ్యమైపోవడం,సమకాలీన రాజకీయాల్లోకి డొల్లతనం ప్రవేశించడం,ప్రపంచవ్యాప్తంగా వచ్చిన లిబరలైజేషన్,గ్లోబలైజేషన్,హిందుత్వమతశక్తుల విజృంభణ,మతాల మారణ హోమాలు ఇత్యాది అమానవీయ విషాద దృశ్యాల సమాజసంక్షోభాలన్నీ దేవిప్రియ కవిత్వంలో వస్తుశిల్పాలై ఒక ప్రత్యేక కవితాశిల్ప రామణీయతకి,అపూర్వ అభివ్యక్తి వైచిత్రికి కారకాలయ్యాయి.

దేవిప్రియ జీవితం పూలబాట కాదు.అలా అని అది పూర్తీ ముళ్ళబాట కాదు.పూలు,ముళ్ళు ,రాళ్ళు కలగలిసిన విచిత్ర అనుభవాల అనుభూతుల అతుకుల గతుకుల బతుకుబాట. దశాబ్దాల కవిత్వవ్యాసంగం,అలుపెరుగని జర్నలిజంతో ముడిపడిన ఒక చేతన్య ప్రవాహం ఆయన జీవితం.ఎక్కడో గుంటూరు జిల్లాలో 1949 ఆగస్టు 15 న జన్మించిన దేవిప్రియ గారు జీవితంలో పేదరికం,కష్టాలు నష్టాలు ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసారు.ఆ క్రమంలోనే ఒక అద్భుత కవిగా పరిణామం చెందారు.

“చూడండి

నేను నా ప్రజలతో నిర్మించబడ్డ కవిని”

అని నిరహంకారంగా చెప్పుకున్న ఈ కవి…

“దేవతలకి స్వర్ణకలశాలతో

పంచామృతాలతో అభిషేకాలు చేశాం

కాని సోదరా..

మనిషి మాలిన్యాన్ని

ఇన్ని నులివెచ్చని కన్నీళ్ళతో

కడిగి శుభ్రం చేయలేకపోయాం”

అంటూ బాధపడిన ఒక మానవతా మూర్తి దేవి ప్రియగారు.

“కవిత్వం నన్ను పట్టుకుంది.మిగిలినవి నన్ను కవిత్వంలా పట్టుకోలేక పోయాయి” అంటూ ‘అవసరాల నిమిత్తమే నేను పత్రికల్లో పనిచేశానని చెప్పుకున్న నిజాయితీ ,నిష్కళంక కవి ఆయన.పత్రికల్లో నిరంతరం టెంక్షన్ వాతావరణంలో పని చేస్తూ అద్భుత కవిత్వం రాయడం అసిధారావ్రతం అని ఎందరికి తెలుసు?అయినా దేవిప్రియ గారు ప్రజావాహిని,నిర్మల,ప్రజాతంత్ర,మనోరమ,ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి,ఉదయం,హైదరాబాద్ మిర్రర్,హెచ్.యం.టి.వి,10టి.వి ల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూనే ..ఎన్నోకవితా సంపుటాలు , గ్రంథాలు ఆవిష్కరించారు. అమ్మచెట్టు(1979)నీటిపుట్ట(1990),తుఫాను తుమ్మెద(1999),పిట్టకూడా ఎగిరిపోవలసిందే(2001),చేప చిలుక(2005),ఎందుకుంటుంది(2009),గాలి రంగు(2011)ఇలా ఎన్నొ అపూర్వ,అద్భుత కవితా సంపుటాలు వెలువరించారు.’గాలి రంగు’ కవితా సంపుటికి 2017 లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది.దేవిప్రియగారు రాసిన “సమాజానంద  స్వామి”(1977),””రన్నింగ్ కామెంటరీ”(మూడు సంపుటాలు)జర్నలిస్టుగా దేవిప్రియ సత్తా ఏమిటో నిరూపించిన రచనలు.ఆయనలో ఉన్న సున్నిత హాస్య ,వ్యంగ్య,చమత్కార చతురతను పలు కోణాల్లో ఆవిష్కరించిన గ్రంథాలవి.

Leave a comment